ఎన్నికల పొత్తులు అనేవి సర్వ సహజమని వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని అందుకే అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. నేడు నాగుల చవితి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారి తోట సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాంధ్రలో మంత్రుల భూ కబ్జాలపై సిఎం జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. విశాఖ రిషికొండ అక్రమాలపై తమ పార్టీ నేతలు ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని, విశాఖను దోపిడీకి రాజధానిగా మార్చారని మండిపడ్డారు. విజ్ఞులు, మేధావులైన ప్రజలు ఈ అక్రమాలపై ఆలోచించాలని కోరారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో ప్రజల్లోకి వెళతామని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ప్రజల్లోకి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తమ విధానమని చెప్పారు. నాడు ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా ఎవరూ ఆక్రమించుకోకుండా చంద్రబాబు నాయుడు కాపాడారని, కానీ వీరు అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమాలకు పాల్పడుతూ మరికొన్ని భూములను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికలో 175 సీట్లు గెలుస్తామన్న భ్రమలో జగన్ ఉన్నారని, ఏం ఉద్ధరించారని మీకు ప్రజలు ఓట్లు వేయాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కనీసం పులివెందులలో కూడా అయన గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నారన్నారు. ఒక్కో మహిళ ఒక్కో ఆది శక్తిగా మారి ప్రభుత్వం చేస్తోన్న మోసాన్ని గ్రహించాలని కోరారు. నాడు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో పోల్చుకోవాలన్నారు. మీపై ప్రజల్లో నెలకొన్న భ్రమలన్నీ తొలగి పోయాయని, వచ్చే ఎన్నికల్లో తాము 160 సీట్లు గెలిచి తీరుతామని, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్నాయుడు ఆయన ధీమా వ్యక్తం చేశారు.