అమరావతి మహా పాదయాత్రపై తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రపై విధించిన షరతులు కొట్టివేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… వారి పిటిషన్ ను తిరస్కరించింది. గతంలో ఆదేశాలు పాటించాల్సిందేనని, వాటిని సవరించబోమని, షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని తేల్చి చెప్పింది.
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఇచ్చిన ఐడి కార్డులుగానీ, లేదా వ్యక్తిగత ఐడి కార్డులు కానీ పోలీసులు అడిగినప్పుడు చూపించాలని చెప్పింది. కేవలం 600 మంది రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనాలని మరోసారి సూచించింది. కాగా, పాదయాత్రకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరఫున డిజిపి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. యాత్రలో ఉల్లంఘన జరిగితే తమ దృష్టికి తీసుకు రావాలని నిర్దేశించింది.