Sunday, November 24, 2024
HomeTrending Newsఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానం

ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానం

సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వ్యక్తులగా, సంస్థలుగా వారు చేసిన గొప్ప పనులకు గుర్తుగా వీటిని అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ –2022 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్, ఆత్మీయ అతిథిగా శ్రీమతి వైయస్‌.విజయమ్మ హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులకు (30 సంస్ధలకు) అవార్డులు గవర్నర్, సిఎం అందజేశారు.

“ఈ అవార్డులు తమ శ్రమతో, స్వేదంతో మనరాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఇస్తున్నాం. ఈ అవార్డులు మన సంస్కృతి, సాంప్రదాయాలకు దశాబ్దాలుగా వారధులుగా ఉన్నవారికి ఇస్తున్నాం. ఈ అవార్డులు మన మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారధులకు ఇస్తున్నాం.ఈ అవార్డులు వెనుకబాటు మీద, అణిచివేత మీద, పెత్తందారీ పోకడల మీద దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులకు, భిన్నమైన కళాలకు, గళాలకు, పాత్రికేయులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డులు మన గడ్డమీద పుట్టి, వైద్య ఆరోగ్యరంగంలో మనిషి ప్రాణాలు నిలబెట్టడంలో అంతర్జాతీయ కీర్తి గడించిన మహామహులకు, అంతర్జాతీయంగా కీర్తి గడించిన మన పారిశ్రామిక దిగ్గజాలకు.. మనం ఈరోజు ఆందరిలో కొందరిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నాం” అంటూ సిఎం జగన్ వివరించారు.

“ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆవార్డులు ప్రతి సంవత్సరం ఎందుకు ఇస్తున్నామంటే దానికి కారణం… మన ప్రభుత్వం ఇటువంటి సేవలను గుర్తిస్తుంది అని చెప్పడానికీ, మన ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులకు అందరికీ కూడా తోడుగా ఉంటుందని సంకేతం ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నాన్నగారి పేరుమీద, ఒక మహానేత పేరు మీద ఇస్తున్నాం. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 నెలల కాలంలో తాను ఆచరించి చూపిన రైతు పక్షపాత, మహిళా పక్షపాత, నిరుపేద పక్షపాత విధానాలకు, సామాజిక న్యాయానికి, ప్రాంతీయ న్యాయానికి,  వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవానికి, మనదైన తెలుగుదనానికి, మన కళలు, సాంప్రదాయాలకు, మన శ్రమకు, పరిశ్రమకు ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డులు ఇస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ మరోసారి నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను” అంటూ సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్