దేశంలో బిసీ జనగణన జరపాలని గతంలో మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. అయినా ఇప్పటి వరకు దానిపై మోదీ నిర్ణయం తీసుకోలేదన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు విహెచ్ మీడియాతో మాట్లాడుతూ కులాల వారిగా జనాభా గణన చేపడితేనే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దేశంలో బీసీ లకు అన్యాయం జరుగుతోందన్నారు.
బీసీ జనగణన జరగాలి .. రిజర్వేషన్ పెంచాలని విహెచ్ డిమాండ్ చేశారు. క్రీమిలేయర్ వల్ల బిసీ లు నష్టపోతున్నారని, మోదీ బీసీ అయివుండి ఆ వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. కేవలం మత్రివర్గంలో బీసీ లకు అవకాశం కల్పిస్తే న్యాయం జరగదని, బీసీ జనగణన జరపక పోతే మోదీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే డిమాండ్ తో మోదీ నీ నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా దీనిపై ప్రజలను చైతన్యం చేస్తానన్నారు.
గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పడం విద్దురంగా ఉందని విహెచ్ ఎద్దేవా చేశారు. గవర్నర్ కే ఆ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని, గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర హోమ్ మంత్రి కి పిర్యాదు చేయాలని అన్నారు. కేవలం మీడియాకు చెబితే లాభం ఏమిటని, గవర్నర్ నిస్సహాయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గవర్నర్ చెబుతున్న అంశాలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడారని, పిసిసి చీఫ్ మాట్లాడిన తరువాత మళ్ళీ నేను దానిపై మాట్లాడనని వి హనుమంత రావు స్పష్టం చేశారు.