శాసనసభ ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. దానికి తోడు హుజూర్ నగర్ నుంచి నిన్నటి మునుగోడు వరకు ఉపఎన్నికలు ఎప్పటికప్పుడు ఎన్నికల వేడి సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావటం… ఆ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ గైర్హాజరు కావటం బిజెపి – తెరాస ల మధ్య మాటల యుద్ధం…ఎన్నికల కొలహలాన్ని తలపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో… టిఆర్ఎస్.. లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు) పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు).,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ..తో కూడిన సంయుక్త సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది. ఈ సమావేశంలో బిజెపి ఫోకస్ గా పార్టీ నేతలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం.
మరోవైపు ఈ సమావేశంలో యువనేత కేటిఆర్ కు TRSLP నేతగా పట్టం కట్టనున్నారని రాష్ట్రంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కెసిఆర్ అంత సాహసం చేయరని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిశాక వాటి ఫలితాలకు అనుగుణంగా కెసిఆర్ నిర్ణయం ఉంటుందని విశ్వసనీయ సమాచారం.
Also Read : అవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం షర్మిల