Friday, June 12, 2026
HomeTrending Newsఅయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం - విహెచ్ పి

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం – విహెచ్ పి

భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు.. మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూ పై ఉందని.. వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  వీరన్నగారి సురేందర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంప చోడవరం నియోజకవర్గం, పురుషోత్తమ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి గోశాలను విశ్వహిందూ పరిషత్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గారు గోశాలలోని గోవులకు మాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కొంతమంది కావాలని గోశాలపై దాడి చేసి..  విధ్వంసం సృష్టించిన ఆనవాళ్లను.. పగిలిపోయిన రేకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాములవారి అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని.. అందుకు విశ్వహిందూ పరిషత్ దే సంపూర్ణ బాధ్యత అన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించి రాజకీయ అండదండలతో అక్రమాలకు పాల్పడితే విశ్వహిందూ పరిషత్ రూపంలో స్వయంగా రాముడే దిగివచ్చి తన భూములు తాను కాపాడుకుంటాడని స్పష్టం చేశారు.  రాజకీయం అశాశ్వతమని.. ధర్మం అనేది శాశ్వతం అని.. అది ఎప్పటికీ ఎవరికీ తెలవంచదన్నారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా చివరకు ధర్మానిదే విజయం అన్నారు. ఇక్కడి దేవుడి భూములు మొత్తం సర్వే చేసి, రికార్డులు ఆధారంగా ఎంత భూమి ఉందో దానికి అంతటికి ఫెన్సింగ్ చేసి దేవుడికి దక్కేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత డిమాండ్ చేశారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్య తీసుకోవాలని సూచించారు.

రాముడి భూములు కాపాడే విషయంలో విశ్వహిందూ పరిషత్ బృహత్తర ఉద్యమం నిర్మిస్తుందన్నారు. యావత్ రామభక్తులను, హిందువులను చైతన్యం చేసి భద్రాచలం భూములను భద్రంగా కాపాడుతామని నాయకులు స్పష్టం చేశారు. తాత్కాలిక స్టేట్మెంట్లు, చిలిపి చేష్టలతో సమయం వృధా చేసుకుని సంబరపడే కంటే.. రాములవారి భూముల పేరుకు రాకుంటేనే మంచిదని భూముల ఆక్రమించుకున్న రైతులకు హితవు పలికారు. లేదంటే ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి.. దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ కుమార్, ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్య అధ్యక్షులు అవులూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, నాయకులు గంగాధరి సీత, రాయగడి విజయలక్ష్మి, బజరంగ్ దళ్, దుర్గా వాహిని నాయకులు జాస్తి శివరాం, రామారావు, కళ్యాణి, ప్రియాంక, మానస, శ్రావణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular