ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేష్ బి లఠ్కర్ చర్చించారు. అనంతరం ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి ఇంద్రజను తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఆ పాపకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎక్కడైనా సరే ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోనుంది.
విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తన ఏడు సంవత్సరాల కుమార్తె ఇంద్రజ అనారోగ్య సమస్యను సిఎం దృష్టికి తీసుకు వచ్చేందుకు శ్రీకాకుళం వచ్చారు. రెండో విడత భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిఎం జగన్ శ్రీకాకుళంజిల్లా నరసన్నపేటలో పర్యటించారు. బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్‌లో నుంచి భాదితులను గమనించి వారివద్దకు వెళ్లి పరామర్శించారు. వారి సమస్యపై వెంటనే స్పందించిన సిఎం జగన్ ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సిఎం పర్యటన ముగిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఇంద్రజ తల్లిదండ్రులను కలుసుకుని చికిత్సకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టారు. సిఎం స్పందనకు పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.