Somu Comments: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేదని చెబుతోన్న సిఎం జగన్.. వారి పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఐకేపి, రైతు భరోసా కేంద్రాలు మిల్లర్లకు ముసుగు కేంద్రాలుగా మారిపోయారని దుయ్యబట్టారు. కాకినాడ పోర్ట్ మిల్లర్ల స్మగ్లింగ్ కు ఓ ప్రధాన కేంద్రంగా తయారైందని ఆరోపించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే వెంటనే ధాన్యం సేకరణను ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిల్లర్ల వద్ద కమీషన్ల కోసమే రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని నష్టాల ఊబి నుంచి బైట పడేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో సోము మీడియాతో మాట్లాడారు.
బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సభను ఈనెల 27న ఏలూరులో గోదావరి జోన్ కు సంబంధించిన సదస్సును నిర్వహిస్తున్నామని, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వీర్రాజు చెప్పారు. ఓ కేంద్ర మంత్రి కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. బస్తీ సంపర్క్ అభియాన్ పేరిట ఎస్సీ కాలనీల్లో ప్రచారం చేశామని, సబ్ ప్లాన్ అమలు చేయకుండా ఎస్సీలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించామని చెప్పారు, ఈ కార్యక్రమం ఎల్లుండి 26తో ముగుస్తుందని చెప్పారు. భూ వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రవేశ పెడితే భూమూల రీ సర్వే పేరుతో సిఎం జగన్ తన ఫోటో ముద్రించిన హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నారని సోము విమర్శించారు. ఇసుక తవ్వకాల కోసం టెండర్లు వేసి తమ వారికే వాటిని ఇచ్చి అక్రమాలు చేస్తున్నారన్నారు.