Movie Review: ‘మా కోరికలు నెరవేర్చకుండా … మా అవసరాలు తీర్చకుండా మమ్మల్ని ఓట్లు అడగొద్దు’ అనే మాటను బయట వింటూనే ఉంటాము. కొన్ని ప్రాంతాలకి సంబంధించిన ఈ తరహా వార్తలను టీవీలలో చూస్తూనే ఉంటాము. సాధారణంగా ఈ తరహా నిరసనలు .. నినాదాలు మురికివాడల నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా కొండ ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ విషయంలో తమ ఆవేశాన్ని .. అసహనాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుందనే కథనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం‘.
టైటిల్ వినగానే ఇది కొండ ప్రాంతానికి సంబంధించిన సమస్య .. దానికి పరిష్కార మార్గాన్ని హీరో ఎలా చూపిస్తాడనేదే కథ అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఈ తరహా కథల్లో ఆవేశం … ఆవేదన .. ఆక్రోశం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సమస్యను పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన హీరో రంగంలోకి దిగుతాడు కనుక, అతను హీరోయిన్ తో కలిసి డ్యూయెట్లు పాడుకుంటే అంత బాగుండదు. తమ గూడెం సమస్యలను పక్కన పెట్టేసి హీరోయిన్ కూడా లవ్ లో పడలేదు. అందువలన ఈ సినిమాలో అలాంటివేం కనిపించవు.
ఇక కామెడీ కూడా లేకపోతే ఆడియన్స్ కి క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఉంటుంది గనుక, వెన్నెల కిశోర్ .. రఘుబాబు పాత్రల ద్వారా నవ్వించే ప్రయత్నం చేశారు .. కానీ అది కొంతవరకే ఫలించింది. ఫస్టాఫ్ కాస్త సాగతీతగా నడిచిన కథ .. ఇంటర్వెల్ తరువాత ఊపిరిని .. ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. కథ మరింత సీరియస్ గా మారిపోతుంది. మారేడుమిల్లి ప్రజల సమస్యలు .. పరిష్కారం అనే విషయం పైనే దర్శకుడు ఏఆర్ మోహన్ దృష్టి పెట్టాడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
ఈ సినిమాలో 40 శాతం కామెడీ ఉంటుందనీ .. 60 శాతం ఎమోషన్స్ ఉంటాయని ప్రమోషన్స్ లో అల్లరి నరేశ్ చెప్పాడు. అయితే ఆ 40 శాతం కామెడీ చప్పగా ఉండటం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. ఎమోషన్స్ పరంగా ఆయన చెప్పినట్టుగానే ఉంది. ఇక ఉన్నంతలో ప్రేక్షకులను నిరాశ పరచకుండా శ్రీ చరణ్ పాకాల మంచి బాణీలను ఇచ్చాడు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పాలి. మారేడుమిల్లి ఫారెస్టులోనే మనం ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.