Saturday, June 13, 2026
HomeTrending Newsమెట్రో రెండో దశకు..మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన

మెట్రో రెండో దశకు..మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన

గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 9 వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన చేయనున్న నేపధ్యంలో గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి లు మెట్రో MD NVS రెడ్డితో కలిసి మైండ్ స్పేస్ జంక్షన్, రాజేంద్ర నగర్ లోని తెలంగాణ పోలీసు గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించారు. శంకుస్థాపన చేయనున్న మైండ్ స్పేస్ జంక్షన్ లో శిలాఫలకం పైలాన్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం, ట్రాపిక్ మళ్లింపు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు ముఖ్యమంత్రి మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన చేసిన అనంతరం పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు లో భాగంగా ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి ORR మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రైలు లైన్ నిర్మాణంలో బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రాంగూడ, నార్సింగి, TS పోలీస్ అకాడమీ, రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎయిర్ పోర్ట్ కార్గో స్టేషన్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తారని అన్నారు.

ఎయిర్ పోర్ట్ నుండి IT కారిడార్ లోని రాయదుర్గం మైండ్ స్పేస్, హై టెక్ సిటీ కి కేవలం 20 నిమిషాలలో చేరుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. మొదటి దశలో 2017 నవంబర్ 29 న నగరంలో మెట్రో రైలు సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మూడు కారిడార్ లలో కలిపి 63 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు మెట్రో రైలులో ప్రయాణం చేసి ఎంతో ఆదరించారని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు ౩౦ కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారని అన్నారు. రెండో దశతో కలుపుకొని మొత్తం 94 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. మంత్రుల వెంట చేవెళ్ళ MP రంజిత్ రెడ్డి, MAUD ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, MLA లు ప్రకాష్ గౌడ్, అరికె పూడి గాంధీ, కాలే యాదయ్య, కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఉన్నారు.

Also Read : మెట్రో రైల్ విస్తరణపై సమీక్ష 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular