Saturday, September 21, 2024
HomeTrending Newsఆయకట్టు చివరి వరకు సాగునీరు

ఆయకట్టు చివరి వరకు సాగునీరు

ఏడు జిల్లాలకు కరీంనగర్ లోయర్ మానేర్ డామ్ ని వరప్రధాయినిగా సీఎం కేసీఆర్ మార్చారని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం గోదావరితో  యావత్ తెలంగాణకు నీరందించిన గొప్ప నేత కెసిఆర్ అన్నారు. సోమవారం ఉదయం కరీంనగర్లో లోయర్ మానేర్ డాం నుండి కాకతీయ కెనాల్ ద్వారా రైతులకు సాగునీటిని వదిలారు మంత్రి గంగుల. ఈ సందర్బంగా గంగుల మాట్లాడుతూ ఏడు జిల్లాల పరిదిలోని 33మండలాలకు చెందిన దాదాపు 10లక్షల ఎకరాలకు ఈ నీటితో లబ్దీ చేకూరుతుందని, ఎల్ఎండి 50ఏళ్ల చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఆయకట్టుకు జూలైలోనే తొలిసారి నీళ్లను వదిలామని, సూర్యాపేటలోని చివరి ఆయకట్టువరకూ ఈ నీరు చేరి రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.

గతంలో కేవలం 3లక్షల ఎకరాలకు నీరివ్వడానికి అపసొపాలు పడేవారమని, అందుకు కారణం ఈ సమయానికి కేవలం 5టీఎంసీల నీళ్లు కూడా లోయర్ మానేర్ డామ్ లో ఉండేవి కావని మంత్రి గంగుల వివరించారు. సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం ద్వారా మిడ్ మానేర్ ద్వారా పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే 24 టీఎంసీలతో పూర్తి నిల్వ సామర్ధ్యంలో 21 టీఎంసీలకు చేరుకుందన్నారు. అందుకే ఈ జూలై మెదట్లోనే 3వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని, రాబోయే రోజుల్లో 5వేల క్యూసెక్కులకు పెంచుతున్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు.

ఆగస్టు, సెప్టెంబర్లలో నాటును వేసుకునే రైతులు, సీఎం కేసీఆర్ అందించిన భరోసాతో నేడు జూలైలోనే నాట్లు వేసుకుంటున్నారని, భవిష్యత్తులోనూ అవసరమైన నీటిని విడుదల చేస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడి నీళ్లు అక్కడేవాడాలని, ఇదే కెనాల్ వద్ద నీటిని విడుదల చేయవద్దని ఇసుక బస్తాలు అడ్డుగా వేసి దర్నాలు, ఆందోళనలు నిర్వహించామని మంత్రి గంగుల గుర్తు చేశారు. నేడు అపర భగీరథుడు సీఎం కృషితో రాష్ట్రం మొత్తం పుష్కలంగా నీటివనరులు అందుబాటులోకి వచ్చాయన్న మంత్రి గంగుల కమలాకర్ దీని కోసమే కొట్లాడి తెలంగాణ సాదించుకున్నామని, మునుముందు ఇదే స్పూర్తితో పనిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు , సుంకిశాల సంపత్ రావు , నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, ఎస్ ఈ శివ కుమార్ ,ఈ ఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ సమ్మయ్య, ఏఈ లు కాళిదాసు, వంశీ, అంజు ఉన్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్