ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా శ్రీమతి ద్రౌపతి ముర్ము ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంశించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీమతి ద్రౌపతి ముర్మకు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌరసన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎంజగన్ మాట్లాడుతూ
“ఇవాళ చాలా గొప్ప రోజు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టం అన్నది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికీ కూడా గర్వకారణం. రాష్ట్రపతిగా తొలిసారిగా మన రాష్ట్రానికి వచ్చిన శ్రీమతి ముర్ముగారిని గౌరవించడం మనందరి బాధ్యతగా భావించి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం… రాజ్యాంగ పరంగా నిర్ధేశించిన అర్హతలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అన్నదానికి ద్రౌపతి ముర్ముగారు ఒక గొప్ప ఉదాహరణగా దేశచరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతారు” అని కొనియాడారు.
“నిష్కళంకమైన మీ రాజకీయ జీవితం, మీరు ఎదిగిన తీరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శనీయం. మహిళా సాధికారతకు మీరు ఒక ప్రతిబింబం. ప్రతి మహిళా కూడా మీలానే స్వయంసాధికారత సాధించాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాలని కాంక్షిస్తూ.. ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది. మీలాంటి వ్యక్తుల నుంచి వారు మరింత చైతన్యం పొందుతారని, ఈ ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు వారి జీవితాల్లో మరిన్ని మార్పులు తీసుకువస్తాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. రాష్ట్రపతి పదవికి మీరు వన్నె తీసుకువస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ దేశ ఖ్యాతిని మరింత పెంచడంలో మీరు తప్పక దోహద పడతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంతున్నాను” అంటూ సిఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.