నటుడిగా రజనీకాంత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. మానవమాత్రులకు సాధ్యం కానిది ఏదయినా రజనీ సాధిస్తాడని ఆయన నటించిన పాత్రలవల్ల ఒకరకమయిన తమాషా పేరు స్థిరపడిపోయింది.
“God can walk on water. Rajni can swim through land!!!
దేవుడు మహా అయితే నీళ్ళమీద నడవగలడు-
అదే రజనీ అయితే భూమ్మీదే ఈదగలడు”
ఇలాంటి వేన వేల అసాధ్య, దుస్సాధ్య, రజనీ హీరోచిత జోకులు సామాజిక మాధ్యమాల నిండా నిర్విరామంగా వైరల్ గా తిరుగుతూనే ఉంటాయి. మరాఠీ అయి ఉండి కర్ణాటకలో పెరిగి, బస్ కండక్టర్ నుండి తమిళనాడు వెండితెరను శాసించే స్థాయికి ఎదిగిన రజనీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమే. ఆయన వయసిప్పుడు డెబ్బయ్. చిన్నా పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కిడ్నీ మార్పించుకున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళకండి అని డాక్టర్లు సలహా కూడా ఇచ్చారు. అయినా సరయిన సమయంలో తను రాజకీయాల్లోకి రావడం ఖాయం అని చెప్పి, కొన్ని యుగాల ఆలస్యంగా, ఎప్పుడు రాకూడదో అప్పుడు వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిలా రాజకీయ ప్రవేశాలకు వయోపరిమితి, కనీస విద్యార్హత, ఎంట్రన్స్ పరీక్షలు లేవు కాబట్టి ఆయన ఎప్పుడయినా రాజకీయాల్లోకి రావచ్చు. పోవచ్చు. అది పూర్తిగా ఆయనిష్టం.
ఇక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై అని రజనీకాంత్ స్పష్టంగా ప్రకటించాడు. సంతోషం. మంచి నిర్ణయం. తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయమే.
నిండు నూరేళ్ల ప్రమాణం ప్రకారం రజనీ ఇప్పటికిప్పుడు తొందరపడాల్సిన పనిలేదు. ఇంకా ఆయన చేతిలో ముచ్చటగా ముప్పయి ఏళ్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఇంకో పది, పదిహేనేళ్ల తరువాత మళ్లీ రాజకీయ ప్రవేశ నిర్ణయం తీసుకున్నా పెద్ద నష్టమేమీ ఉండదు.
“సరయిన సమయంలో సరయిన నిర్ణయం. The right decision at the right time” అన్నది ఆదర్శం. బెంగళూరులో బస్ కండక్టర్ గా ఉన్నప్పుడు సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుని రజనీ ఒక చరిత్ర సృష్టించాడు. అలాంటివాడికి ఇప్పుడు రాజకీయ ప్రవేశానికి, వైదొలగడానికి ఏది సరయిన సమయమో ఇంకొకరు చెప్పాల్సినపనిలేదు.
డాక్టర్లు మనిషి అవయవాలను, వాటి పనితీరును, వైద్య పరీక్షల రిపోర్టులను చూసి వారి అనుభవంమేరకు ఏదో చెబుతుంటారు. బయట ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిని మిరాకిల్స్ అంటుంటారు. రజనీ మిరాకిల్స్ కే మింగుడుపడని మిరాకిల్ కాబట్టి- డాక్టర్ల భయంలో హేతుబద్దత లేదు.
“రజనీయే రాజకీయాల్లో అడుగుపెట్టిననాడు…
సాగరములన్నియు ఏకము కాకపోవు!
సముద్రాలన్నీ ఊళ్లళ్లోకి వస్తాయి.
ఊళ్లన్నీ సముద్రంలో మునుగుతాయి.
ఆకాశం నేలకు దిగుతుంది. నేల ఆకాశానికెక్కుతుంది!”అని అనుకున్నారు. అద్భుతాలు చెప్పి జరగవు. జరిగినప్పుడే తెలుస్తుంది. సినిమాల్లో రజనీ అద్భుతం. రాజకీయాల్లో కాదు. నిండు నూరేళ్లు రజనీ సినిమా అద్భుతాలను చేస్తూనే ఉండాలని కోరుకుందాం.
-పమిడికాల్వ మధుసూదన్
Must Read : కూతురు డైరెక్షన్ లో ‘రజనీకాంత్’?