రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని, కరోనా రెండో దశ వ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని, ఇప్పటి వరకు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
సామాజిక దూరం పాటిస్తూ.. ఫేస్ మాస్కును తప్పనిసరిగా ధరించాలన్న ఆరోగ్యశాఖ సంచాలకులు వీలైనంత వరకు జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. మూడో దశ ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సంసిద్ధమైనట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందని, దీని ద్వారా ఫాజిటివిటీ రేటు తగ్గించుకోవచ్చని శ్రీనివాసరావు చెప్పారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు.