ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను శృతి హాసన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేమనుకునే రంగంలోకి దిగిందిగానీ, అంతలో ప్రేమ వ్యవహారంలో పడిపోయి ఆ విషయాన్ని మరిచిపోయింది. ఆ మత్తులో నుంచి ఆమె బయటపడేసరికి, బాలీవుడ్ లో మరింత పోటీ పెరిగిపోయింది. అక్కడ స్టార్ డమ్ రాకపోయినా, యూత్ లో క్రేజ్ ను మాత్రం సంపాదించుకోగలిగింది. అవకాశాల కోసం మళ్లీ ఆమె టాలీవుడ్ బాట పట్టింది.
ఆ సమయంలో గోపీచంద్ మలినేని ఆమెకి ‘క్రాక్’ సినిమాలో రవితేజ జోడీగా ఛాన్స్ ఇవ్వడం .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమెకి కలిసొచ్చింది. ఆ తరువాతనే ‘వకీల్ సాబ్’ చేయడం .. ‘సలార్’లో అవకాశం దక్కడం జరిగింది. ‘సలార్’ సినిమా విడుదల ఇప్పట్లో లేకపోవడంతో అప్పటి వరకూ వెయిట్ చేయవలసిందేనా? అని అభిమానులు నిరాశ చెందారు. ఆ సమయంలోనే ఆమె చిరంజీవి సినిమాకీ .. బాలయ్య మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇటు చిరంజీవికీ .. అటు బాలయ్యకి ఉన్న మాస్ ఫాలోయింగ్ తెలియంది కాదు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ .. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ .. ఈ రెండు సినిమాలు మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్నవే. అందువలన మాస్ ఆడియన్స్ ఈ సినిమాల కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రావడం .. ఒకరోజు తేడాతో విడుదలవుతుండటం మరో విశేషం. చిరూ .. బాలయ్య ఈ మధ్యకాలంలో ఇంత దగ్గరగా పోటీపడింది లేదు. ఈ సినిమాలు హిట్ కొడితే శ్రుతి హాసన్ కి న్యూ ఇయర్ కలిసొచ్చినట్టే అవుతుంది.