పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తానని చెప్పకుండా సిఎం జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని చెప్పడం విచిత్రంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకు వచ్చేందుకే అయన ప్రయతిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలు అంతా గాలికి వచ్చి గాలికి పోయే నేతలేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండల గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశంలో అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడిపై మరోసారి ఫైర్ అయ్యారు.
కాపుల గుండెల్లో కుంపటి, శవాలపై పేలాలు ఏరుకుంటున్నానంటూ తనపై పవన్ చేసిన విమర్శలపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని చంద్రబాబు దగర ఊడిగం చేస్తారో, జగన్ నమ్ముకొని ఆయన వెంటే ఉన్న తనను నమ్ముకుంటారో కాపులు తెల్చుకోవాలంటూ హితవు పలికారు. బుద్ధి, జ్ఞానం లేని పవన్ కు అసలు రాజకీయాలు తెలుసా అంటూ ప్రశ్నించారు. పవన్ ఇప్పటి వరకూ ఎన్ని పార్టీలతో కలిశారో అలోచించుకోవాలన్నారు. తాను ఎవరినుంచీ ఒక్క పైసా ఆశించలేదని, అలాంటి తనపై ఆరోపణలు చేయడమేమిటని నిలదీశారు. వైసీపీ నుంచి పవన్ రాజకీయాలపై ధీటుగా విమర్శలు చేస్తున్నానని, అందుకే తనను దుష్ట చతుష్టయం లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు.