Sunday, June 14, 2026
HomeTrending Newsత్వరలో పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి వైద్యులు : మంత్రి హరీశ్‌రావు

త్వరలో పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి వైద్యులు : మంత్రి హరీశ్‌రావు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాగజ్ నగర్ లో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అంతకుముందు మంచిర్యాల జిల్లా బెలంపల్లిలో 14 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ లలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 102 డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పామని స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో కూడా త్వరలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు, మాత శిశువుల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేకంగా కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్లను ఇస్తున్నామని అన్నారు.

ఎమ్మెల్యే కోనప్ప నిత్యాన్నదానం చేయడం అభినందనీయమన్న మంత్రి.. ఆయనను చూసే తాను కూడా సిద్దిపేటలో ప్రారంభించానని తెలిపారు. గర్భిణీల కోసం కోనప్ప పల్లిపట్టి కిట్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో డయాలిసిస్ సెంటర్లను 102కు పెంచామన్న హరీష్… వారం రోజుల్లో కాగజ్నగర్లో 9 డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ANM సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా మారుస్తున్నామన్న హరీష్.. కరోనా మళ్లీ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతు అమలు చేస్తోందని అన్నారు. త్వరలో 950 డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవలక్ష్మి , ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు ,కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ వాజ్‌పాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular