నాగార్జున ఈ సంవత్సరంలో ‘బంగార్రాజు’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. ఆతర్వాత బాలీవుడ్ ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో నాగ్ నటనకు గాను బాలీవుడ్ లో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరాకి ‘ది ఘోస్ట్’ అంటూ భారీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా మీద నాగ్ చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ది ఘోస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో నాగ్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది..? ఏ తరహా సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.
ది ఘోస్ట్ మూవీ తర్వాత నాగార్జున..మోహన్ రాజాతో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కనపెట్టారని తెలిసింది. రచయిత ప్రసన్న కుమార్ నాగార్జునకు ఓ కథ చెప్పడం.. ఈ కథ నచ్చి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా రవితేజ ధమాకా మూవీకి ప్రసన్న కుమార్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడంతో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు.
ప్రసన్న కుమార్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ కథను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను కూడా ఆయనకే ఇచ్చారు నాగార్జున. ఈ కథలో ఒక కీలకమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్రను యంగ్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారట. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. అల్లరి నరేష్ అని సమాచారం. మొత్తానికి నాగార్జున తదుపరి సినిమా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో అని అలాగే ఆ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి.. ఈ సినిమాతో నాగార్జున సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.