రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టిందని…. ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం, జనం బాగా రాకపోయినా…వచ్చారని చూపించడం కోసం ఎనిమిది మందిని చంపేశారంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో కందుకూరు ఘటనపై సిఎం స్పందించారు. ఒక చిన్న సందులోకి, గొందిలోకి…. ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని.. తన వాహనాన్ని అటు తీసుకెళ్ళి ఈ మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా ఇలాగే షూటింగ్ కోసం 29 మందిని ఇదే పెద్ద మనిషి చంపేశారని గుర్తు చేశారు. ఆ రోజు కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనుకున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయమంటే షూటింగ్ లు… డైలాగ్ లు…, డ్రోన్ షాట్లు కాదని, డ్రామాలు అంతకన్నా కాదని… రాజకీయమంటే ఒక రైతు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, బిసి, ఒక మైనార్టీ, మధ్య తరగతి కుటుంబాల్లో, అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకు రాగాలిగామన్నదేనని స్పష్టం చేశారు.
మన ప్రభుత్వ బడుల, ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మార్చడం, ప్రతి గ్రామంలో రైతన్నను చేయి పట్టుకొని నడిపించడం, లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో ఉండేలా చేయడం, ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు ఇవ్వడమేనని వెల్లడించారు.
ఒక మాట ఇస్తే మాట మీద నిలబడడం… అన్ని ప్రాంతాలూ, అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేయడం, అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను చూసుకుంటూ వారందరి ఆత్మ గౌరవం నిలబెట్టడం తనకు తెలిసిన రాజకీయమన్నారు. రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదని, సేవ మాత్రమేనని స్పష్టం చేశారు.