గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటన వెలువరించింది.
గత పది రోజులుగా మూడుసార్లు బాహాటంగా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామని, కనీసం రోడ్ల గుంటలు పూడ్చలేకపోయామని, ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకుండా వాలంటీర్లు, వైసీపీ గ్రామస్థాయి కన్వీనర్లు నియామకం చేసి ఏం ప్రయోజనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు కూడా అయన ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. దీనితో వైసీపీ అధ్యక్షుడు, సిఎం జగన్ ఆదేశం మేరకు ఈ నియామకం చేపడుతున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన వెలువడించింది.
వెంకటగిరితో పాటు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఆమంచి కృష్ణ మోహన్ కు అప్పగించారు.