Saturday, September 21, 2024
HomeTrending Newsఅవార్డులతో పాటు డబ్బులు ఇవ్వండి - మంత్రి ఎర్రబెల్లి

అవార్డులతో పాటు డబ్బులు ఇవ్వండి – మంత్రి ఎర్రబెల్లి

కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధత కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన తర్వత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 4 స్టార్ రేటింగ్ అవార్డుల్లో మొదటి మూడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల అభినందనలు తెలిపారు.

మొదటి మూడు స్థానాల్లో వచ్చిన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. 3 స్టార్ రేటింగ్ అవార్డులలో మొదటి అవార్డు సిద్దిపేటకు, రెండవది జగిత్యాల జిల్లాకు రావడం విశేషం అన్నారు. 2 స్టార్ రేటింగ్ అవార్డులలో కూడా మొదటి స్థానం తెలంగాణకి రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుకు, పాలనాదక్షతకు నిదర్శనం అన్నారు. అవార్డులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపైన కక్ష సాధింపు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కేంద్రం నిధులు మళ్లిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రం నుంచి గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ అధికారులను హైదరాబాద్ కు తీసుకొస్తే హైదరాబాదులోని మా శాఖ అధికారులను తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళించామా? లేదా ? అనే సమాధానం చెప్తాము అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కల్లాల పేరు మీద 1100 కోట్ల రూపాయలను ఆపారని చెప్పారు. కల్లాలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే… 1100 కోట్లు రూపాయలు ఎందుకు ఆపారని ప్రశ్నించారు? కల్లాలు కడుతున్నామని కేంద్రానికి లేఖ రాసినప్పుడే అనుమతి ఇవ్వకపోతే కట్టే వారం కాదన్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు వద్దు అనడం సమంజసం కాదన్నారు. కల్లాల కోసం ఖర్చు చేసిన 150 కోట్లు కేంద్రానికి కడతామని రాతపూర్వకంగా రాసిచ్చిన రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇది కేంద్రం పొరపాటు కాదా? అని ప్రశ్నించారు.

గ్రామపంచాయతీలకు ఆరు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. మేం చెప్పే దాంట్లో తప్పులుంటే లెక్కలు తెప్పించుకొని అవగాహన చేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయిపడి లేదన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాక ఇబ్బంది జరుగుతోందన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు డబ్బులు వేస్తోందని కావాలంటే మీ అధికారుల ద్వారా చెక్ చేసుకోవచ్చని చెప్పారు. బండి సంజయ్ కి అవగాహన లేకుండా మాట్లాడతారని మూతికి, ముక్కుకు తేడా తెలువదని అన్నారు. అందుకే ఆయనకు రిప్లై చెప్పదలుచుకోలేదని తెలిపారు. బండిని గుండు అంటాడని, గుండును బండి అంటాడని ఆయనకేమీ తెలవదు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దయచేసి అవగాహనతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే ఇన్ని అవార్డులు ఇచ్చారు. కానీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ కు ఏ అవార్డులు ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని డబ్బులు వచ్చే విధంగా కనీసం ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి , జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్