Friday, November 22, 2024
HomeTrending News‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఇది సహించలేని సిఎం జగన్ కక్షలు, కార్పణ్యాలతో తమ పార్టీ నేతలు, వారి సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గీతం యూనివర్సిటీలో ఆక్రమిత భూములు ఉన్నాయంటూ వాటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. దీనిపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ అంశంపై అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“గత మూడున్నర సంవత్సరాలుగా విశాఖలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుంటున్న జగన్ రెడ్డి.. అందులో భాగంగానే ఈ రోజు ప్రఖ్యాత గీతం విద్యా సంస్థలపై ఆరోపణలు చేస్తూ ఆస్థి ధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూములు ఆక్రమించిందని చెప్పి ఏమీ తేల్చలేదు. ఇప్పుడు మరోసారి ఆక్రమణల ఆరోపణలతో గీతం వర్శిటీ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు పెరగడంతో… జగన్ రెడ్డి ఫ్రెస్టేషన్ పీక్స్ కు చేరింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చీపుర్లతో తరిమి కొట్టడం తధ్యం అని తేలిపోయింది. ఏం చేయాలో తెలియని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ నేతలపై, వారి సంస్థలపై దాడులకు తెరలేపారు.

విశాఖలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కబ్జా చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రత్యర్ధుల భూముల్ని కూడా స్వాహా చేసేందుకు ఏకంగా అధికారుల్ని వాడుకుంటున్నాడు. గీతం యూనివర్శిటీపై చేసే ఆరోపణలు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసినవే. నిజంగా ఆక్రమణలు ఉంటే నోటీసులిచ్చి తర్వాత చర్యలకు దిగాలి. నోటీసులు కూడా ఇవ్వకుండా సర్వేలు చేయడం, కంచెలు వేయడం రాజకీయ కక్ష సాధింపులే. రాజధాని పేరుతో ప్రశాంత విశాఖను ఫ్యాక్షన్ కేంద్రంగా మార్చారు. భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్ మెంట్లకు కేంద్రంగా తయారు చేశారు.

జీవో నెం.1 పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి జగన్ రెడ్డి తూట్లు పొడుస్తూ చేస్తున్న అప్రజాస్వామిక, నింతృత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. జీవో పేరుతో చంద్రబాబు నాయుడు గారి సభలను అడ్డుకోవడం, వైసీపీ నేతల సభలు, ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేయడంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఈ అరాచక పాలన నుండి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ రోజు గీతం వర్శిటీపై పడ్డారు. జగన్ రెడ్డీ.. ఇలాంటి ఎన్ని ఆరోపణలు చేసినా, నిందలేసినా వచ్చే ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని కట్టకట్టి బంగాళాఖాతంలో పడేయడం తధ్యం” అంటూ పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్