Sunday, November 24, 2024
HomeTrending Newsరేంజర్ల రాజేష్ అరెస్టుకు VHP డిమాండ్

రేంజర్ల రాజేష్ అరెస్టుకు VHP డిమాండ్

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని.. నాస్తికవాదం ముసుగులో హిందుత్వం పై దాడి జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ (VHP) ఆరోపించింది. పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించింది. సీఎం ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని.. నిందితులకే మద్దతుగా నిలుస్తోందని పేర్కొంది. నిందితులకు మద్దతు పలుకుతూ.. బాధితులను భయకంపితులను చేస్తోందని మండిపడింది. సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అన్నారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. నాస్తికత్వం పేరుతో దేవుడు లేడు అంటూనే క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని విమర్శించారు. జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించి క్రైస్తవ మతంలోకి మారిన మల్లికార్జున్ పై రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామినీ కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే.. నిందితులను శిక్షించకపోగా.. కేసు వాపస్ తీసుకోవాలని బజరంగ్దళ్ కార్యకర్తలను పిలిచి నలుగురు పోలీసు అధికారులు పోలిస్ స్టేషన్ లోనే చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. ఇప్పటికీ ఆ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, సాక్షాదారులతో సహా మానవ హక్కుల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు, హైకోర్టులో కూడా వారి దాస్టికం గురించి ఫిర్యాదు చేస్తామన్నారు.

కల్వకుర్తి కేంద్రంగా హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఈ తంతు సాగుతుందన్నారు.
తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇస్లాం తీవ్రవాదులు తిష్టవేశారని.. భగవద్గీత పేరుతో ఇస్లాం సాహిత్యాన్ని ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతున్నారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. రేంజర్ల రాజేష్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రగతి భవన్ ముట్టడిస్తామని మరోసారి హెచ్చరించారు. రాష్ట్ర నలుమూలల నాస్తికత్వం పేరుతో హిందుత్వం పై జరుగుతున్న దాడిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రేగు అనిల్, భరత్ వంశీ, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్