తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారని, అయినా తనకు ఎలాంటి భయం లేదని సింహంలా సింగల్ గానే వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పొత్తులూ అవసరం లేదని, ఎవరి మీదా ఆధారపదబోడని, మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడని… కారణం తాను నమ్ముకున్నది మిమ్మల్ని, ఆ దేవుడినే అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు ముసలాయన మాదిరిగా మీడియా సంస్థలు అండగా లేకపోవచ్చని, దత్తపుత్రుడూ తనకోసం మైక్ పట్టుకోక పోవచ్చని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “నేను వీళ్ళను నమ్ముకోలేదు, నా ఎస్సీలను, నా బీసీలను, నా ఎస్టీలను, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను నేను నమ్ముకున్నాను” అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న చేదోడు కింద మూడు లక్షల 30 వేల మందికి 330 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
తమ ప్రభుత్వంలో కేవలం బటన్లు మాత్రమే ఉన్నాయని, ఎక్కడా లంచాలు గానీ, వివక్ష గానీ లేదని… బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోనే సాయం జమ చేస్తున్నామని చెప్పారు. ముసలాయన పాలనలో గజ దొంగల ముఠా ఉండేదని, వారికి దుష్ట చతుష్టయం అనే పేరు కూడా ఉండేదని, అది ‘దోచుకో తినుకో పంచుకో’ (డిపిటి) విధానంతో రాష్ట్రాన్ని దోచుకున్నారని సిఎం నిప్పులు చెరిగారు. ఆ పాలన మళ్ళీ కావాలా.. మీ బిడ్డ పాలన ఉండాలా అనేది ప్రజలే అలోచించుకోవాలన్నారు.
తన ప్రభుత్వం నిరంతరం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సంక్షేమం కోసమే ఆలోచిస్తోందని సిఎం వెల్లడించారు. వారిని ఎప్పుడూ నా సొంత మనుసులుగానే భావిస్తూ ఉంటానని గుర్తు చేశారు. 11.43 శాతం గ్రోత్ రేట్ తో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళపట్టాలు ఇచ్చిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు.