మన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ఠను ప్రభుత్వం దెబ్బతీసిందని కేంద్ర మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం వేలుపెట్టి, తనను తొలగించి సంస్థకు శాశ్వత డామేజ్ చేశారన్నారు. 17 ఏళ్ళుగా ఆడిట్ చేయాల్సింది ప్రభుత్వమేనని, కానీ అది తన బాధ్యత నిర్వహించలేదని తెలిపారు. మధ్య మధ్యలో ఆడిటింగ్ చేసినా వివరాలు సమర్పించాలేదన్నారు. ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్టు ఏటా 95 లక్షలు పన్నుగా చెల్లిస్తోందని వివరించారు. సోదరుడు ఆనంద గజపతిరాజు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
హిందూ దేవాలయాలపై ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేస్తోందని, సింహాచలం భూముల అక్రమాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని అశోక్ గజపతి అన్నారు. 700 ఎకరాలు అంటే చిన్న విషయం కాదని, ఆలయ భూములను కాజేయడానికి కొందరు ప్రయతిస్తున్నారని ఆరోపించారు. భూముల పర్యవేక్షణకు అధికారులుగా ఇతర మతాలకు చెందిన వారిని నియమిస్తున్నారని చెప్పారు. కొందరు ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాల్సిందిగా పైడితల్లి అమ్మవారిని ఇటీవల ప్రార్ధించానని, వారికి త్వరలోనే జ్ఞానం వస్తుందని అనుకుంటున్నట్లు అశోక్ గజపతి చెప్పారు.