Sunday, November 24, 2024
HomeTrending Newsగులాబీమ‌య‌మైన నాందేడ్...బీఆర్‌ఎస్ సభకు స‌ర్వం సిద్ధం

గులాబీమ‌య‌మైన నాందేడ్…బీఆర్‌ఎస్ సభకు స‌ర్వం సిద్ధం

మ‌హారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్య‌క్షులు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంత‌రం చెందిన త‌ర్వాత జాతీయ‌స్థాయిలో జ‌రుగుతున్న తొలి స‌భ కావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేశారు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, ష‌కీల్, టీఎస్ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు, సివిల్ స‌ప్లైస్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ రవీంద‌ర్ సింగ్, త‌దిత‌ర నేత‌లు గ‌త కొన్ని రోజులుగా ఇక్క‌డే ఉండి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

మ‌హారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) సీయం కేసీఆర్ స‌భ నేప‌థ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గ‌త వారం రోజులుగా నాందేడ్ లో మ‌కాం వేసి ఇత‌ర నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ… అన్నీ తానై సీయం కేసీఆర్ స‌భ‌ ఏర్పాట్లలో నిమ‌గ్న‌మ‌య్యారు. స‌భ ఏర్పాట్ల‌ను చూస్తూనే… విస్తృతంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ స‌ర్పంచ్ లు, ఇత‌ర స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులను, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను క‌లుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మ‌ర‌ఠా వీధుల్లో క‌లియ తిరుగుతూ వృద్దులు, మ‌హిళ‌లు, రైతులు, యువ‌కులను ప‌ల‌క‌రిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసీఆర్ నేతృత్వంలో అమ‌ల‌వుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వివ‌రిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీయం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియ‌జేస్తున్నారు. బీఆర్ఎస్ విస్త‌ర‌ణ అవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ…. బీఆర్ఎస్ ను ఆధ‌రించాల‌ని కోరుతున్నారు.

మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌లో మ‌న‌ రాష్ట్ర స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోక‌ర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజ‌క‌వ‌ర్గాలు, కిన్వ‌ట్, ధ‌ర్మాబాద్ ప‌ట్ట‌ణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయ‌త్ న‌గ‌ర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్ర‌జ‌లు స్వ‌చ్చంద త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా స‌రిహ‌ద్దు తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గ‌లైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధ‌న్, జుక్క‌ల్ తో పాటు నిర్మ‌ల్, నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, శ్రేణులు స‌భ‌కు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పుతున్నాయి.

Also Read : రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్