Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఈ ఆకలి తీరనిది

ఈ ఆకలి తీరనిది

హిందూపురంలో తిరుగుతున్న ప్రతిసారీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు నన్ను వేధిస్తుంటాయి.

1. హిందూపురం ముందు పుట్టి…చిరు తిళ్లు తరువాత పుట్టాయా? చిరు తిళ్లు ముందు పుట్టి తరువాత హిందూపురం పుట్టిందా?
2. రెండు లక్షల జనాభా ఉన్న హిందూపురం చిరు తిళ్లకు ఒక్క వాసవీ ధర్మశాల రోడ్డు స్ట్రీట్ ఫుడ్ ఎలా సరిపోతోంది?
3. హిందూపురంలో ఇళ్లల్లో అసలు ఏమయినా వండుకుంటారా? లేక రోడ్ల మీదే తినేసి ఇళ్లకెళ్లి పడుకుంటారా?
4. యాభై, అరవై ఏళ్లుగా హిందూపురం తిన్న బజ్జీలెన్ని? పానీపూరీలు ఎన్ని? దాల్ మసాలా, బారా మసాలాలు ఎన్ని టన్నులు? శాండ్ విచ్చులెన్ని? నిప్పట్ మసాలాలు ఎన్ని హాంఫట్ అయ్యాయి? చాట్లు, భేల్ పూరీలు ఎన్ని స్వాహా అయ్యాయి?


5. మల్లెపువ్వు మెత్తటి ఇడ్లిలు ఎన్ని కోట్లు అరిగిపోయాయి? మసాలాదోసెలు ఎన్ని కోట్లు ఆవిరయ్యాయి? పితికి బేడల పప్పు ఎన్ని క్వింటాళ్లు జీర్ణమయ్యింది?
6. కోవా కూరిన ఓళిగలు(బొబ్బట్లు) ఎన్ని నాలుకమీద నామరూపాల్లేకుండా పోయాయి?
7. చక్కిలాలు, నిప్పట్లు, కోడిబేళ్లు ఎన్ని లారీలు అయిపోయి ఉంటాయి?
8. మిగతా ప్రాంతాలవారికి అర్థం కాని…ఏనాడూ వినని…రుచి చూడని…అన్నన్ని ఐటమ్స్ కనుక్కున్న, కనుక్కుంటున్న హిందూపురం పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రపంచం ఎందుకు గుర్తించలేదు?


9. రోడ్డుమీద మనుషులతో పాటు ఆవులు, ఎద్దులు, ఎనుములు(గేదెలు) ఇతర జంతువులు కూడా తినుబండారాల స్టాళ్ళ చుట్టూ నిలుచున్నా సహృదయంతో సర్దుకుపోయే హిందూపురం ఔదార్యం, హృదయ వైశాల్యం ఎందుకు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు?
10. అంత దుమ్ము ధూళిలో తింటున్నా హిందూపురం ఆరోగ్యాలు చక్కగా ఉండడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఎందుకు కాలేదు?

కొసమెరుపు:-
ఇది ఏ మాత్రం నెగటివ్ కాదు. పరమ పాజిటివ్. ఇరవై అయిదేళ్లపాటు హిందూపురవాసిగా నేను కూడా ఇలాగే…ఇంతకంటే ఉధృతంగా…కరువుతీరా…తిన్నాను కాబట్టే…ఆ పులకింత కొద్దీ చెప్పగలుగుతున్నాను. ఇలా ఎలా తింటారు? అని మీరు ఆశ్చర్యపోయినా…పోకపోయినా…మా హిందూపూర్ ఇలాగే తింటుంది. తిని అరిగించుకుంటుంది.

దమ్ముంటే…
మీ నాలుకకు శక్తి ఉంటే…
మీ పొట్టలో చోటు ఉంటే…
మీరూ తినండి…
రండి…ఒకసారి హిందూపురం వాసవీ ధర్మశాల రోడ్డుకు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

కడుపు నిండే పేర్లు

Also Read :

యునెస్కో గుర్తింపుకు అడుగు దూరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్