Share to Facebook Share to Twitter share to whatapp share to telegram
దక్షిణ మధ్య టర్కీ, పశ్చిమ సిరియాల్లో ఫిబ్రవరి 6న సంభవించిన విధ్వంసక భూకంపం తర్వాత మన దేశం ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై 7.5 పరిమాణం (మ్యాగ్నిట్యూడ్) తో విరుచుకుపడిన ఈ ఆకస్మిక ఉత్పాతం అపార ప్రాణనష్టానికి కారణమైంది. టర్కీ భూకంపంతో పోలిస్తే మన దేశంలో భూగర్భంలోని పలకల కదలికలు, ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలపై సంక్షిప్త సమాచారం అందించే ప్రయత్నం ఇది.
చరిత్రలో నమోదైన భూకంపాల తీవ్రత, భూభౌతిక పరిశోధనల సాంకేతిక వివరాలతో భారతీయ ప్రమాణాల సంస్థ (Bureau of Indian Standards-BIS) దేశాన్ని ఐదు ( సైస్జ్మిక్- Seismic) జోన్లుగా మ్యాపింగ్ చేసింది.
ఇందులో 2, 3 జోన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలు సురక్షితమైన సేఫ్ ఏరియాలు. అదృష్టవశాత్తు తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని విశాఖపట్నం సురక్షితమైన జోన్ -2 పరిధిలో ఉన్నాయి. తెలంగాణాలోని మూడొంతుల భాగం జోన్ -2 కింద ఉండటం అత్యంత ఉపశమనం కలిగించే అంశం. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు పూర్తిగా (తీవ్ర భూచలనాలకు అవకాశం లేని) జోన్- 2 లో ఉన్నాయి. తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలు జోన్- 3 కిందకు వస్తాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు ప్రాంతాలు జోన్- 3 కింద, పశ్చిమ ప్రాంతాలు జోన్ -2 లో ఉన్నాయి. జోన్- 3 లోనివి కూడా భూకంప విధ్వంసానికి గురయ్యే ప్రాంతాలు కానందున ఆందోళన చెందాల్సిందేమీ లేదు.
జోన్- 3 పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఒక మోస్తరు, జోన్ -4 కిందకు వచ్చేవి తీవ్ర తాకికిడి గురయ్యేవి( High) గా, జోన్- 5 పరిధిలోనివి అత్యంత తీవ్ర భూకంపాలకు లోనయ్యే (Highest) విగా వర్గీకరించారు.
ఎగువ ఉన్న మ్యాపును పరిశీలిస్తే జోన్ల వారిగా ఏ ప్రాంతాలు దేని కిందకు వస్తాయో గుర్తించవచ్చు. తుఫాన్లను ముందే గుర్తించ వచ్చు. అల్పపీడనం నుంచి వాయుగుండంగా తర్వాత దశలో అత్యంత తీవ్ర తుపానుగా మారడానికి నాలుగు రోజులు పడుతుంది. ఈలోగా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు పౌరులను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. భూకంపాలను ముందే పసిగట్టలేమని నిపుణులు చెపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com