యువ గళం పాదయాత్రలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సంసిరెడ్డిపల్లెకు లోకేష్ యాత్ర చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో పోలీసులు లోకేష్ ను అడ్డుకుని ఆయన ప్రసంగించాల్సిన మైక్ ను లాక్కున్నారు. ఈ ప్రదేశంలో సభకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో లోకేష్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని, ఏ నిబంధన ప్రకారం తనను నిలువరించారని నిలదీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతులో పట్టుకొని చూపిస్తూ తాను అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం ప్రకారం యాత్ర చేస్తున్నానని, అడ్డుకోవడానికి మీకేం హక్కు ఉందంటూ ఫైర్ అయ్యారు.