Sunday, November 24, 2024
HomeTrending Newsఅంతర్జాతీయ డేటా ఎంబసీ ఏర్పాటు చేయాలి - మంత్రి కేటీఆర్

అంతర్జాతీయ డేటా ఎంబసీ ఏర్పాటు చేయాలి – మంత్రి కేటీఆర్

డాటా ఎంబసీలను కేవలం గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మంత్రి కే తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన ఈ విషయంలో మొత్తం డేటా ఎంబసీలని కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుందని మంత్రి కేటీఆర్ ఈరోజు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలన్నకుంటున్న గుజరాత్ గిఫ్ట్ సిటీ, భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న భౌగోళిక ప్రాంతమని, దీంతో పాటు దేశ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రంలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్క్ తో కూడుకున్నదని తెలిపారు. ఇదే లేఖలో హైదరాబాద్ నగరానికి భౌగోళికంగా ప్రకృతి వైపరీత్యాలు నుంచి సహజంగా వస్తున్న రక్షణ, అనుకూలతలను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కి వివరించి, డేటా ఎంబసీ సెంటర్లను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. డేటా ఎంబసీల ఏర్పాటు విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన సెస్మిక్ జోన్-2 లో హైదరాబాద్ నగరం ఉన్నదని అందుకే హైదరాబాద్ నగరంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం అత్యుత్తమమైన నిర్ణయం అవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న, గిఫ్ట్ సిటి సెస్మిక్ జోన్ 3 మరియు సేస్మిక్ జోన్ -4 కి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతమని, తద్వారా ఇక్కడ భూకంపాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నదని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొత్తం డేటా ఎంబసీల కార్యకలాపాలు స్తంభించి, దాని ప్రభావం అంతర్జాతీయ సంబంధాలపై ఉంటుందన్నారు.

ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో తమ డేటా సెంటర్లను ఏర్పాటుకు ముందు విస్తృతమైన అధ్యయనాలను చేసి, తెలంగాణను తమ డేటా సెంటర్లకు కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి మొదలుకొని మైక్రోసాఫ్ట్ వరకు అనేక కంపెనీలు హైపర్ స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. 2016 లోనే తెలంగాణ ప్రభుత్వం తమ డేటా సెంటర్ పాలసీని ప్రకటించిందని, ఇందులో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్ పాలసీ అత్యంత ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. డ్యూయల్ పవర్ గ్రిడ్ సౌకర్యంతో పాటు అత్యంత తక్కువ ధరకే విద్యుత్ సరఫరా, హై స్పీడ్ ఫైబర్ నెట్వర్క్ వంటి అనేక అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన కంపెనీలు తమ కార్యకలాపాల పట్ల, ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయాన్ని సైతం కేటీఆర్ తన లేఖలో నిర్మల సీతారామన్ కు వివరించారు. ఇప్పటికే అనేక డేటా సెంటర్ లను ఏర్పాటు చేసిన కంపెనీలకు అందించిన పూర్తి సహాయ సహకారాలను ఇంటర్నేషనల్ డేటా ఎంబసీస్ ఏర్పాటుకు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు.

డేటా ఎంబసీలను కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునర్ పరిశీలించి, ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన డేటా ఎంబసీస్ ఏర్పాటును దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసే విధంగా పునర్నిర్వచించాలని కేటీఆర్ కోరారు. తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఈ విషయంలో సమాన అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందని కేటీఆర్ తెలిపారు.

pls Note – ఏదైనా ఒక దేశానికి చెందిన కంపెనీ ఒక డేటా ఎంబసిని ఏర్పాటు చేస్తే దానికి ప్రస్తుతం దౌత్య కార్యాలయాలకు ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. ఆయా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న దేశ చట్టాల నుంచి వెసులుబాటు/రక్షణ ఈ డేటా ఎంబసీస్ లకు ఉంటది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్