కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ-తెలుగుదేశం పార్టీలమధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు స్థానిక టిడిపి ఆఫీసుపై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ పార్క్ చేసిన ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. వల్లభనేని వంశీ తమను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. సిఎం జగన్ అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకురౌడీలు చెలరేగిపోతున్నారని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అచ్చెన్న ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, ఈ దాడికి సూత్రదారి వంశీనేఅని, అతని కనుసన్నల్లోనే దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక్క ఏడాది ఓపికపట్టాలని ఆ తర్వాత నీ తల పొగరు అణిచివేస్తామంటూ వంశీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని,చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.