రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు చేసే ఆందోళనలకు తాము అండగా ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూలై 20న మంగళవారం అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ల వద్ద నిరుద్యోగులకు సంఘీభావంగా నిరనస తెలిపి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో నిరుద్యోగులు, యువత తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని పవన్ అన్నారు. తాము వంచనకు గురయ్యామని వారు ఫీలవుతున్నారని, అదే విషయాన్ని ఇటీవల తనను కలిసి చెప్పారని పవన్ వివరించారు. వారి ఆవేదన తనను కలచి వేసిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఒక్క పోలీసు శాఖలోనే 74 వేల సిబ్బంది అవసరమని గుర్తించారని, ఏటా ఆరువేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలండర్ లో కేవలం 640 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. ఉద్యోగాల కోసం యువత వేలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం లక్షలాది మంది ఎదురుచూస్తుంటే ప్రభుత్వ క్యాలండర్లో ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం తమ పార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులకు మాత్రం కొత్త పదవులు సృష్టించి ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత 10 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశతో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారని , ఇప్పుడు వారంతా తాము వంచనకు గురయ్యామన్న వేదనతో ఉన్నారని పేర్కొంది.