Sunday, November 24, 2024
HomeTrending Newsతుది దశలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు

తుది దశలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు

హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కట్టడాలు, అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహంకు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేశామని అధికారులు మంత్రికి వివరించారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్, స్మృతివనం, సెంట్రల్‌ లైబ్రరీ, ఫౌంటెన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మార్చి చివరి నాటికి నిర్మాణం పనులు పూర్తి అవుతాయని చెప్పారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తున్నారు. 125 అడుగుల ఎత్తు…45.5 ఫిట్ల వెడల్పులో విగ్రహం ఉంటుంది. పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ ప్రాంతం సుందరంగా తీర్చి దిద్దే విధంగా అంబేద్కర్ విగ్రహ పనులు సాగుతున్నాయని, ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు (సోమవారం) అమెరికా వెళ్ళనున్నారు. అమెరికా లోని ఉతా (UTA) నార్త్ సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ (FAMILY SEARCH INTER NATIONAL ) ఆధ్వర్యంలో జరగనున్న రూట్స్ టెక్- 2023 ఎక్స్ పో (ROOTS TECH EXPO-2023)లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొననున్నారు. అదే విధంగా అమెరికా పర్యటన లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాటర్ డిసెన్స్ సంస్థ (LDS)సంస్థ ప్రతినిధులను కలవనున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన కు వచ్చిన LDS ప్రతినిధుల బృందం జగిత్యాల జిల్లా ధర్మపురి, పెద్దపల్లి జిల్లా ధర్మారం పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రలను పరిశీలించారు. గ్రామాల్లో విద్యా వైద్య రంగాలకు తమవంతు సహకరిస్తామని అప్పట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు అమెరికాలో ల్యాటర్ డిసెన్స్ సంస్థ ప్రతినిధులు డైరెక్ట్ ఆవ్, స్టివ్ లతో భేటీ కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్