మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. కేసీఅర్ చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు..తెలంగాణ ప్రజల పోరాటం వల్ల వచ్చిందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ చేసిన ప్రొ.కోదండరాం ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బచావో సదస్సులో ఉద్యమకారులు పాల్గొంటారని, ఈ సదస్సులో వచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
లిక్కర్ స్కాం చూస్తే అధికారాన్ని ఎట్లా వాడుకుంది అర్థమవుతుందని కోదండరాం పేర్కొన్నారు. ఒకే కుటుంబం ఢిల్లీ స్థాయిలో మద్యంలో వాటాలు పొందాలని చూసిందని ఆరోపించారు. భారాస నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగ పడుతోందని, భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుందని విమర్శించారు. ఉద్యమకారులను మాత్రమే సదస్సుకు అహ్వానిస్తాం.. పార్టీల ప్రతినిధులను ఆహ్వానించమని స్పష్టం చేశారు.
కేసీఆర్ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారని, డిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజల పట్ల శాపంగా మారిందని ప్రొ.కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్,నిజ్జన రమేష్ ముదిరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దార సత్యం, కెవి రంగారెడ్డి , విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్, ఉపాధ్యక్షుడు మనోజ్, యువజన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, నాయకులు ఫయాజ్ మహిళా రాష్ట్ర నాయకులు పుష్పలీల, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…