చిరంజీవి రీ ఎంట్రీ ఆతర్వాత నుంచి స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆతర్వాత సైరా నరసింహారెడ్డి అనే భారీ పాన్ ఇండియా మూవీ చేశారు. ఆతర్వాత ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోవడంతో అభిమానులు కోరుకున్నట్టుగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారు.
అయితే.. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. వినాయక్, పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ చిరంజీవితో సినిమా చేసేందుకు కథలు రెడీ చేస్తున్నారు. తాజా మలినేని గోపీచంద్ కూడా ఈ లిస్ట్ లో చేరారు. ఇటీవల బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ సాధించిన మలినేని గోపీచంద్ ఇప్పుడు చిరంజీవితో మూవీ చేయాలి అనుకుంటున్నారు. తాజాగా చిరంజీవికి గోపీచంద్ కథ చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. అది.. చిరుకి సైతం బాగా నచ్చిందట. దీని పై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది.
చిరంజీవి వెంకీ కుడుములతో ఓ ప్రాజెక్టు చేయాలి. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఆ సినిమా ఉందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమా పై ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ లేదు. ఒక వేళ వెంకీ కుడుముల సినిమా లేకపోతే.. మలినేని గోపీచంద్ తో సినిమా మొదలవుతుంది అని వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల కూడా లైన్‌లో ఉంటే.. ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.