సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం కు చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. . శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు.