పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నేడు కూడా ఆందోళనకు దిగారు. లోక్ సభ సమావేశం ప్రారంభం కాగానే పెగాసస్ స్పై వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించే విషయంపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో రాజమండ్రి ఎంపీ, వైసీపీకి చెందిన మార్గాని భరత్ వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి, వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వెల్ లోకి దూసుకు వచ్చారు. చైర్మన్ వెంకయ్య నాయుడు సభను ఒంటిగంటకు వాయిదా వేశారు. ఒంటిగంటకు సభలో కోవిడ్ పరిస్థితులపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు. అయితే వైసీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. కోవిడ్ పై చర్చకు సహకరించాలని రాజ్యసభలో పాలక పక్ష నేత పీయూష్ గోయల్ కోరారు. తృణమూల్ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా కోవిడ్ పై చర్చను ప్రారంభించారు. వైసీపీ సభ్యులు పదే పదే అడ్డు తగలడంతో డిప్యూటీ చైర్మన్ సభను మరోసారి 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.