పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ కొరత లేకుండా చేయవచ్చని, వృద్ధి రేటు 14 శాతానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అమలు చేస్తోన్న పారిశ్రామిక, విద్యుత్ విధానాలు పెట్టుబడులకు అనుకూలంగా, సరలతరంగా ఉన్నాయని అందుకే పంప్ద్ స్టోరేజ్ రంగంపై ముఖేష్ అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి ప్రదర్శించారని చెప్పారు.
సిఎం జగన్ ఏదైనా చెబితే చేస్తారనే నమ్మకం, విశ్వాసం పెట్టుబడిదారుల్లో నెలకొందని, అందుకే దేశంలోని సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు తరలివచ్చారని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం కావడానికి సిఎం జగన్ ఎంతో కృషి చేశారని, క్రెడిట్ ఆయనకే దక్కుతుందని చెప్పారు. సమ్మిట్ ఈ స్థాయిలో జరగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, పసలేని ఆరోపణలు చేస్తున్నారని, పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందంటూ గగ్గోలు పెడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు.