Sunday, November 24, 2024
HomeTrending Newsపవన్ ది గంటకో మాట : బొత్స ఎద్దేవా

పవన్ ది గంటకో మాట : బొత్స ఎద్దేవా

పవన్‌ కళ్యాణ్  ను చూస్తే జాలేస్తోందని, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్ధం కావడం లేదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదు. అందుకే పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడిస్తున్నాడేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న 18 ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని, రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అయినా గతంలో అలా టికెట్లు ఇచ్చిందా? రాజ్యసభలో బీసీలకు ఇచ్చిన సీట్లు లెక్కలోకి రావా? అని ప్రశ్నించారు. బీసీలను ఈ ప్రభుత్వం కాపాడలేక పోయిందని చెప్పాలనుకుంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏ రకంగా కాపాడిందో బేరీజు వేసి చెప్పాల్సిందని సూచించారు. విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాయలంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బొత్స పవన్ బీసీ సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించారు.

సెలబ్రిటీ పార్టీ నాయకుడైన పవన్‌ కళ్యాణ్‌ మూడ్‌ వచ్చినప్పుడు… క్షుణ్ణంగా పరిశీలించకుండా, నోటికి ఏది వస్తే అది,  ఏదో ఒక అంశంపై మాట్లాడతాడని బొత్స విమర్శించారు. అలాంటి సందర్భాల్లో నా వంటి వారి పేర్లు ప్రస్తావిస్తాడని, అతనిలా నాకు కులం లేదు.. అంటూ గంటకో మాట మాట్లాడటం లేదని స్పష్టం చేశారు.

తూర్పు కాపుల్లో తాను ఒక్కడినే మంత్రి అయితే ఆ కులంమొత్తం బాగు పడుతుంది అనుకుంటే పొరపాటేనని, తనకంటే ముందు కళా వెంకట్రావు. మృణాళికమ్మ, నారాయణస్వామి, శ్రావణ్‌ లాంటి తూర్పు కాపు నాయకులు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు.  అసలు పవన్‌ కళ్యాణ్‌ ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నాడో చెప్పాలని కోరారు. “నాకంటే ముందు పది మంది వరకూ తూర్పు కాపులు మంత్రులయ్యారు కదా…వారి వల్ల బాగుపడ్డది ఉందా…నేను చెడగొట్టింది ఉందా?” అంటూ నిలదీశారు.

“నీ కులాన్ని నువ్వెందుకు చెప్పుకోవడం లేదు? ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని రీచ్‌ కావడానికి నిజాయితీగా ప్రజల్ని మొప్పించే దిశగా ఉండాలి… వాళ్ల మీద వీళ్ల మీద రెండు మాటలు మాట్లాడి వెళ్లడం రాజకీయం కాదు.  ఇలాంటివన్నీ ఆపి నిర్మాణాత్మకంగా ఆలోచనతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ∙ముపై నలభై ఏళ్ల తర్వాత ఫలితాలుంటాయి… ఇప్పుడుండవు” అంటూ పవన్ కు హితవు పలికారు.

అసలు వైఎస్సార్సీపీని ప్రజలు ఎందుకు కాదంటారు అనే దానికి సమాధానం చెప్పాలని, 99 శాతం మేం హామీలను అమలు చేయడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టితో సేవ చేస్తున్నామన్ని బొత్స చెప్పారు.  అందుకే తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఢిల్లీని తలదన్ని మన విద్యా విధానం గురించి దేశం చర్చించుకుంటోందన్నారు. వచ్చే పదేళ్ళలో మన రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకున్న సంస్కరణల ఫలితాలు కన్పిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే 175 సీట్లు గెలుస్తాం అని స్పష్టంగా చెబుతున్నామని పేర్కొన్నారు.

విశాఖ రాజధానిపై వ్యాఖ్యానిస్తూ “ఉగాదికి కాదు. రేపటి నుంచే రాజధాని విశాఖకు రావాలని నా కోరిక. చాలా మంది దుష్టులు, దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారంతా రాక్షసుల్లా యజ్ఞ భంగం చేయాలని చూస్తారు. – వాళ్లను తట్టుకుని బయట పడాలి. అందుకు కొంత టైమ్‌ కావాలి” అని బొత్స వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్