కృష్ణాజలాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత, మాజీ మంత్రి డా. ఎంవి మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల వివాదం నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ రాయలసీమ హక్కుల పరిరక్షణకు గొడ్డలి పెట్టు లాంటిదని, అలాంటి గెజిట్ ను స్వాగతించే ముందు ప్రభుత్వం అలోచించి ఉండాల్సిందని మైసూరా అన్నారు. కృష్ణా జలాల విషయంలో పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు కేంద్రం తన అధీనంలోకి తీసుకుందని వివరించారు.
విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నీటిని తోడేయడం సరైంది కాదని, ఇలా నీటిని వినియోగించడం రెండు రాష్ట్రాలకూ నష్టం చేకూరుస్తుందని వైసూరా వివరించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని, మా హక్కుల విషయంలో చేతులెత్తేసి నట్లేనా అని ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భేషజాలు ఎందుకు వచ్చాయో తెలియదని, కృష్ణా నీటి విషయంలో కలిసి ఎందుకు మాట్లాడుకోరని సూటిగా నిలదీశారు. గతంలో గోదావరి నీటి విషయంలో సంబంధిత ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్లే ఇప్పుడు కూడా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.