Thursday, June 18, 2026
HomeTrending Newsఫ్యామిలీ డాక్టర్‌ సేవలకు సన్నద్ధం: మంత్రి రజిని

ఫ్యామిలీ డాక్టర్‌ సేవలకు సన్నద్ధం: మంత్రి రజిని

మందుల షాపుల్లో మత్తుమందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని, జల్లెడ పట్టాలని  డ్రగ్స్‌ నియంత్రణ విభాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. కంటివెలుగు మూడో దశలో భాగంగా మిగిలిన 35,42,151 మందికి స్క్రీనింగ్‌ కోసం 376 బృందాలను ఏర్పాటు చేశామని, ఆర్నెల్లలో వీరందరికీ స్క్రీనింగ్‌ పూర్తి చేసి, అవసరమైన వారికి సర్జరీలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని  సూచించారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నేడు మంత్రి రజిని వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధికారులతో బ సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌ అంచనాలు, కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ పథకాల తీరుతెన్నులపై ఆరా తీశారు.

కంటివెలుగు పథకం జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టును వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. 146 కొత్త 104 అంబులెన్సులు అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాత వాటిలో ఎన్ని ‘మహా ప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల నిల్వలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలని, ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం జిల్లా నోడల్‌ అధికారి తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని విలేజ్‌ క్లినిక్స్‌ను పరిశీలించి, అక్కడేవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి త్వరలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత మాటే లేకుండా అన్ని స్థాయుల పోస్టులను భర్తీ చేయాలని మంత్రి రజిని ఆదేశించారు. నాడు–నేడు పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, వైద్య కళాశాలల భవనాల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, ఆ శాఖ కమిషనర్‌ నివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular