మన్సాస్ ట్రస్టు ఈవో పై కోర్టు ధిక్కరణ నోటీసు వేస్తున్నట్లు ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రకటించారు. మునుపెన్నడూ ట్రస్టులో సిబ్బందికి జీతాల సమస్య రాలేదని, మొట్టమొదటి సారి జీతాల కోసం ఉద్యోగులు ఆందోళన చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సిబ్బంది లేకపోతె ఏ సంస్థకూ మనుగడ లేదని, అలాంటిది సిబ్బందికి జీతాల చెల్లింపును సమస్యగా భావించడం తనను ఎంతో బాధించిందన్నారు. జీతం అడిగితే సిబ్బందిపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. నెలవారీ జీతాలపై ఆధారపడి బతికే వారికి జీతాలు ఆపడం భావ్యం కాదని, జీతం రాకపోతే ఈవో పని చేయగలరా అని ప్రశ్నించారు.
ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ తీసుకుంటున్న చర్యలు సంస్థ అభివృద్ధికి దోహదం చేసేవిగా భావించడం లేదని, చైర్మన్ హోదాలో తాను అడుగుతున్న విషయాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్న అశోక్ జగపతి, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం మినహా మరో మార్గం లేదన్నారు.