అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తన పార్టీ కార్యకర్తలకు నిన్నటి సభ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నారు. పైన ఒక పార్టీతో, కింద ఒక పార్టీతో పవన్ పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఓ సిద్దాంతం లేని పార్టీ జనసేన అని అభివర్ణించారు.
పవన్ అసెంబ్లీకి వస్తానంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిన పనిలేదని, స్పీకర్ గారికి చెప్పి రెండు పాస్ లు పంపిస్తామని గుడివాడ వ్యంగాస్త్రం సంధించారు. పవన్ ను తాము ప్యాకేజీ స్టార్ అంటే ఎంతో బాధ పడతారని, కానీ చంద్రబాబు పార్టీకి కరపత్రంగా పనిచేసే ఓ పత్రిక బ్యానర్ హెడ్డింగ్ తో ఇలాంటి వార్త రాస్తే ఎందుకు అంతగా ప్రతిస్పందించలేదని ప్రశ్నించారు. నెలరోజులుగా బంకర్ లో ఉన్న వ్యక్తి బందర్ వచ్చారని, జెండా ఆయనది అయితే అజెండా మాత్రం తెలుగుదేశం పార్టీదని గుడివాడ విమర్శించారు. ఓ వైపు కుల ప్రస్తావన లేని రాజకీయాల కోసం తాను వచ్చాయని చెప్పుకుంటూనే నిన్నటి సభలో కులాలగురించే ఎక్కువ మాట్లాడారని చెప్పారు. అన్ని సీట్లకూ పోటీ చేస్తామని చెప్పే ధైర్యం లేదని, పోనీ మరో పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పే ధైర్యం కూడా లేదని దుయ్యబట్టారు. తెలంగాణాలో ఉన్న పోరాట స్పూర్తి ఇక్కడ లేదని మాట్లాడతారని, అలా అయితే అక్కడే పార్టీ పెట్టి పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
Also Read : గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్