ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది, ఐదు గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఎనిమిది మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఏడుగురు వైసీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు.
సిఎం జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉపమంత్రి (ఆబ్కారీ) నారాయణ స్వామి, రాష్ట్రమంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత, రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటి వరకు 35మంది తమ ఓటు హక్కును వినియోగించు కున్నట్లు తెలిసింది.
తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా పోటీ చేస్తున్నారన్న వాదనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. తమ పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నారని, కొందరు వైసీపీ సభ్యులు కూడా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసే అవకాశం ఉందని చెప్పారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నలుగురు కూడా తమకే ఓటు వేస్తారని, తాము టిడిపిని వీడి తప్పు చేశామనే భావన వారిలో నెలకొని ఉందని చెప్పారు.