నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ‘దసరా’ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని ఈ సినిమా విశేషాలని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
“సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది. దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూశాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది.
నటుడిగా నేను ఆనందపడతాను కానీ.. తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్. ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను.
కథ విన్నప్పుడే ప్రేమ, స్నేహం, పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మతో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మన కల్చర్ చెప్పడం మన బాధ్యత. దీనిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి.
నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్నాను. నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి. నార్త్ లో కూడా రెస్పాన్స్ చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరాకి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది.
యు.ఎస్ లో 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. అక్కడి ఆడియన్స్ ప్రేమకు కృతజ్ఞతలు. నెంబర్స్ అలా వుంచితే సినిమా రాగానే చూడాలని ఫిక్స్ అవుతున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోగలిగితే చాలు. నాని మంచి సినిమాలు చేస్తాడని చాలా మంది బాక్సాఫీసు సినిమాలతో పోలికలు తెస్తారు. ఇక నుంచి ఈ కంపారిజన్లు ఆగిపోతాయి. ప్రతి సినిమా ఒక టార్గెట్ వుంటుంది. దాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రతి సినిమాని ప్రత్యేకంగా చూడాలి. ప్రభాస్, మహేష్.. గారు అందరూ దసరాని మెచ్చుకుంటూ మెసేజ్ లు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇలా అందరూ మెసేజ్ చేశారు. ఇది ఆనందంతో పాటు బాద్యతని కూడా పెంచుతుంది” అంటూ వెల్లడించారు.
Also Read : Dasara: ఆ ఒక్క బిట్ కోసమైనా ‘దసరా’ చూడొచ్చు!