పవన్ కళ్యాణ్ తెలంగాణకు వకాల్తా పుచ్చుకొని ఎందుకు మాట్లాడారో, ఈ కొత్త వకీల్ పాత్ర ఏమిటో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసలు ఈ కొత్త బాధ, బంధం ఏమిటి… హరీష్ రావు ఏమన్నారో పవన్ చూశారా అంటూ ప్రశ్నించారు. సొంత రాష్ట్రాన్ని కన్నతల్లిగా భావిస్తామని… అలాంటి ఏపీ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణా మంత్రి మాట్లాడితే ఇక్కడున్నవారు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు కదా అని పేర్ని ప్రతిస్పందించారు. రాజకీయ అవసరాల కోసం, లాభాల కోసం తప్ప ఏపీ గురించి పట్టదా, రాష్ట్రం మీద ప్రేమ లేదా, ఇది సొంత గడ్డ అనే భావన లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.
హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రతిస్పందన గానే ఇక్కడి నేతలు మాట్లాడారని, దీనిపై పవన్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బొత్స, ఇతర మంత్రులకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అంటూ పవన్ మాట్లాడడం ఏమిటని, ఇవి కిరాయి మాటలు కావా అంటూ ధ్వజమెత్తారు. గతంలో బాబును, లోకేష్ ను ఏమైనా అంటే పవన్ ముందుకొచ్చి మాట్లాడేవారని, ఇప్పుడు తెలంగాణ మంత్రులపై మాట్లాడితే వస్తున్నారని విమర్శిచారు. ఇలాటి దుర్మార్గ మైన మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు.
సింగపూర్ నుంఛి ఎవరో బంధువులు వస్తే పవన్ మొన్న ఢిల్లీ వెళ్ళారని, ఐదురోజులు అక్కడ ఉండి సందట్లో సదేమినా, పుణ్యం, పురుషార్ధం రెండూ కలిసి వస్తాయన్న చందంగా కేంద్ర మంత్రులను కలిసారని అన్నారు. రాష్ట్రం మీద ప్రేమ, మమకారం లేకుండా కేవలం రాజకీయాల కోసమే ఉపయోగించుకోవడం ఏమేరకు సబబో ఆలోచించుకోవాలని, సందట్లో సడేమియా రాజకీయాలు కట్టిపెట్టాలన్నారు.