మాజీ ఎంపీ పొంగులేటి కుట్రలు, కుయుక్తులు సాగవని, చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఎంపీగా 5ఏళ్ల పదవీ కాలంలో ఆయన జిల్లాకు,ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఆయన పగటి కలలను కల్లలు చేస్తూ జిల్లాలోని పదికి పది సీట్లను ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడం, సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని రవిచంద్ర ధీమాగా చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం చెన్నూరులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వాన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే పలు కార్యక్రమాలకు సొంతంగా పథక రచన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెడుతున్నదని చెప్పారు.కేసీఆర్ సుపరిపాలనలో కరువు కాటకాల జాడే లేదని, పల్లెలు పాడిపంటలు,పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. మన పల్లెలకు నిన్న కాక మొన్న 13 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ,మొత్తం 46 అవార్డుల్లో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదని రవిచంద్ర వివరించారు.మహనీయులు అంబేడ్కర్ 125అడుగుల కాంస్య విగ్రహాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా ఆవిష్కరించుకోవడం, సచివాలయాన్ని అద్భుతంగా కట్టించి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని యావత్ దేశం చర్చించుకుంటున్నదని,ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు.ఈ విధంగా సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ వైపు,అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందిన, చెందుతున్న తెలంగాణ రాష్ట్రం వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారని,ఆయన పాలన కోరుకుంటున్నారని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు,రైతు సంఘాల నాయకులు,ఇతర పార్టీలకు చెందిన వాళ్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు.
సమ్మేళనంలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావు, కల్లూరు జెడ్పీటీసీ అజయ్ బాబు,ఎంపీపీ బీరవల్లి రఘు తదితరులు పాల్గొన్నారు