ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం లో రోడ్ షో, బహిరంగ సభకు బాబు విచ్చేశారు. అయితే దళితులపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు బాబును అడ్డుకునే ప్రయంతం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ-టిడిపి శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొందరు టిడిపి కార్యకర్తలు మంత్రి సురేష్ కార్యాలయంలోకి చోచ్చుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంలో సురేష్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను తగల బెడతారా” రండి’ అంటూ చొక్కా విప్పి దూసుకెళ్ళారు.
దీనికి స్పందనగా వైసీపీ నేతలు బాబు ప్రసంగించే వ్యాన్ పై రాళ్ళురువ్వారు. ఈ దాడిలో NSG కమాండోస్ చంద్రబాబుకు రక్షణ గా నిలిచారు. NSG కమాన్డెంట్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. వైద్యులు మూడు కుట్లు వేసి కట్టు కట్టారు. కాగా వర్షం, ఈదురు గాలులతో బాబు రోడ్ షో కు ఆటంకం ఏర్పడింది, పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ సమయంలో వాహనంలో కూర్చున్న చంద్రబాబు ఆ తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మంత్రి సురేష్ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని అసమర్ధుడు ఆదిమూలపు సురేష్ అని బాబు మండిపడ్డారు. తనముందు కుప్పిగంతులు వేయవద్దంటూ హెచ్చరించారు. నేడు బట్టలు విప్పి దౌర్జన్యం చేసిన సురేష్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించి బట్టలిప్పి పంపుతారంటూ ఘాటుగా విమర్శించారు.