సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం నిర్వహణ తీరుపై విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడు జరిగినంత చెత్తగా మరెప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు. గర్భగుడిలో పోలీసుల జులుం ఎక్కువగా కనిపించిందని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రతి ఏడాదీ తమను సలహాలు అడిగేవారని, ఈసారి అలాంటిది జరగలేదని, ఆరు నెలలుగా ఈ దేవస్థానానికి ఈవో లేకపోవడం బాధాకరమన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఓడిశా ప్రజలకు ఇలవేల్పు అని అలాంటి ఈ ఉత్సవానికి విఐపి టిక్కెట్లు పోలీసుల ద్వారా అమ్మించారని ఆరోపించారు.
గర్భ గుడిలో ఏమాత్రం మడి, ఆచారం, సంప్రదాయం లేకుండా పోయిందని స్వరూపానంద ఆవేదన చెందారు. భక్తుల ఇబ్బందులు చూసి ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధ కలుగుతోందని అన్నారు. సింహాద్రి అప్పన్న పేదల దేవుడని, ధనవంతుల దేవుడు కాదని, అలాంటిది ఇన్ని విఐపి దర్శనాలేమిటని నిలదీశారు. పేదలకు దేవుణ్ణి దూరం చేయడం సరికాదన్నారు.