రాష్ట్రంలో విపక్షాలు రోజురోజుకీ బలహీన మవుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఏలూరు కార్పోరేషన్ లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించిందని, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించామని విశ్లేషించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజల అశీస్సులున్నాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే విజయం సాధిస్తామని గతంలోనే తాము చెప్పామని, అయితే ఎన్నికలు వాయిదాకు, కౌంటింగ్ వాయిదాకు కుట్రలు చేశారన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లోనూ ఈ తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని అయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరులో తమ పార్టీకి 56.3 శాతం ఓట్లు వచాయని, తెలుగుదేశం పార్టీ 28.3 శాతానికే పరిమితమైందని చెప్పారు.
వైఎస్సార్సీపీ నేతలు రోడ్లు దొంగతనం చేశారంటూ ఈనాడు దినపత్రిక రాసిన వార్తపై సజ్జల తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచలను ఎలా వస్తాయో అర్ధం కావడంలేదన్నారు. ఐదేళ్ళు సిఎంగా ఉండి, కరకట్టలోనే నివాసం ఉండి, కనీసం ఆ కరకట్టను వెడల్పు చేసుకోలేకపోయారని సజ్జల దుయ్యబట్టారు. ఇటీవలే సిఎం జగన్ కరకట్ట వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని, అందుకే జాకీలు పెట్టి లేపినా ప్రజలు మద్దతు తెలపడం లేదని సజ్జల తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రోడ్లు గుంతలు పడ్డాయంటూ టిడిపి నేతలు రోడ్లపై మొక్కలు నాటి నాటకాలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఇప్పటికే రోడ్ల మరమ్మతులకు సిఎం జగన్ 2 వేల కోట్లు నిధులు కేటాయించారని వివరించారు. వర్షాలు పడుతున్నప్పుడు ఎవరూ రోడ్లను బాగు చేయరని, కనీసం ఆ జ్ఞానం కూడా తెలుగుదేశం నేతలకు లేకపోవడం శోచనీయమన్నారు.